Siddeshwarayanam

సిద్దేశ్వరయానం – 47 Siddeshwarayanam – 47

🌹 సిద్దేశ్వరయానం – 47 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


🏵 శ్రీశైలము: 1257 సం||– 🏵

యువకుడు: మీరెవరు? ఎక్కడనుండి వస్తున్నారు?

యువతి: నీవెవరి కోసం ఎదురు చూస్తున్నావో ఆ వ్యక్తిని నేను.

యువ: నేను వ్యక్తుల కోసం ఎదురు చూడడం లేదు.

యువతి : తెలుసు. దేవత కోసం ఎదురు చూస్తున్నావు. ఆ దేవతను నేనే.

యువ: ఆశ్చర్యంగా ఉంది. దేవత అయితే ఆకాశం నుండి దిగి రావాలి. తేజో మండలం మధ్య ఉండాలి.

యువతి : నేను పై నుండే దిగి వచ్చాను. నీ కోసం నాలుగడుగులు భూమి మీద నడిచాను. నా చుట్టూ ఉన్న తేజస్సు చూచే శక్తి ఇంకా నీలో జాగృతం కాలేదు.

యువ: కొంత నమ్ముతున్నాను. కాని పూర్తి నమ్మకం కుదరటం లేదు.

యువతి : సహజమే. కొద్దిసేపటిలో కలుగుతుంది.

యువ: సరి! దూరం నుంచి వచ్చారు. పండ్లు, మంచినీళ్ళు ఇస్తాను. స్వీకరించండి!

ఆమె తల ఊపింది. అతడు లేచి ఒక పెద్ద ఆకు తీసుకొని దొన్నెవలె చేసి కొలనులోని నీరు తెచ్చి యివ్వబోయినాడు. ఆమెను సమీపించ లేకపోతున్నాడు. ఏదో అడ్డం వస్తున్నట్లు అనిపించింది. ఆశ్చర్యపడినాడు.

యువతి : నా అనుమతిలేక నా దగ్గరకు ఎవరూ రాలేరు. నీచేతిలోని దొన్నె దానంతట అదే నా చేతిలోకి వస్తుంది. చూడు ! అలాగే జరిగింది. అతనికి దిగ్భ్రాంతి కలిగింది.

యువ: మీరెవరు ? సామాన్య స్త్రీ కాదు.

యువతి : నేనెవరో ముందే చెప్పాను.

యువ: అయితే మీరు దేవత అన్నమాట. నన్ను రక్షించిన గురుదేవులు మీరేమి చెప్పితే అది చేయమన్నారు. ఆజ్ఞాపించండి. అని ఆమె పాదములకు నమస్కరించాడు. ఆమె చిరునవ్వు నవ్వింది. యువకుడా! ఎదురుగా ఉన్న కొలనులో నీవిప్పుడు స్నానం చేయాలి. నేను కూడా వస్తున్నాను. పద!

ఇద్దరూ సరస్సులో ప్రవేశించారు. నీటిలో గొంతు లోతు దిగిన ఆమె శరీరంలో నుండి సెగలు పొగలు వస్తున్నవి. చుట్టూ నీరు తుక తుక ఉడుకుతున్నది. అతనికి తెలిసింది. తనకు తెలియనిదేదో జరుగుతున్నది. జరుగబోతున్నది. ఆమె దగ్గరకు వచ్చి అతని చెయ్యిపట్టుకొన్నది. ఆ హస్తము

యొక్క ఉష్ణోగ్రత అతడు భరించ లేకపోయినాడు. భయం లేదు – అంటూ ఉండగానే ఆమె చేతిలోనుండి అతని శరీరంలోకి అతి తీవ్రమైన విద్యుచ్ఛక్తి ప్రసరించటం మొదలైంది. కొంతసేపు గడిచిన తరువాత నీటిలో నుండి బయటకు దారితీసింది. ఇవతలకు వచ్చిన తరువాత శరీరాలలోని వేడికి గుడ్డలు వాటంతట అవే ఆరిపోయినవి.

యువ : జరిగినదంతా చాలా చిత్రంగా ఉంది. ఈ ఉష్ణతాపమేమిటి?. ఈ విద్యుత్తేమిటి? మీరెవరు ?

యువతి: సిద్ధేశ్వరా ! నేను హిమాలయ సిద్ధాశ్రమం నుండి వచ్చిన కుంగామోను. నీలాచలయోగి నీ దగ్గరకు రావలసిన సమయాన్ని గుర్తు చేశాడు.

యువ: నా పేరదా? నీ పేరేమిటి చిత్రంగా ఉంది?

యువతి : మూడువేల యేండ్ల నుండి ఈ పేరుతోనే ఏడవ శతాబ్దంలో నిన్ను పిలిపించుకొని నీకు సిద్ధశక్తులిచ్చాను. ఇప్పుడూ అందుకే వచ్చాను.

యువ: ఇది యేదో ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న రచనవలె ఉంది. కొంత కొంత అర్థమవుతున్నది.

యువతి : నీవు మా వర్గానికి చెందిన సిద్ధుడవు. మహా గురువుల ఆజ్జ వల్ల నీవు జన్మలెత్తి లౌకిక ప్రపంచంలో నెరవేర్చవలసిన కొన్ని ధర్మాచరణలున్నవి. ఎప్పటికప్పుడు నీకు గుర్తు చేసి సిద్ధశక్తులిచ్చి కర్తవ్య విజయానికి తయారు చేయటం మా విధి, ఇప్పుడు నీవు చేయబోయేది మామూలు సాధన కాదు. మంత్రయాన పద్ధతి. నీకు వజ్రవైరోచనీ మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. ఆ చెట్టు క్రింద రాలిన ఆకులే ఆసనంగా కూర్చుండి జపం మొదలు పెట్టు. కండ్లు వాటంతట అవి మూత బడుతవి. వాటిని తెరవలేవు. ఎంత సమయం గడుస్తున్నదో నీకు తెలియదు. పరవశమైన స్థితిలో ఉంటావు. మంత్రసిద్ధి కాగానే నీకు తెలుస్తుంది. కండ్లు తెరచుకుంటవి. అప్పుడు అసలు కార్యం ఇదిగో! మంత్రం, నేను పైకి ఉచ్చరించటం లేదు. నీకు వినిపిస్తుంది. పద…

( సశేషం )

🌹🌹🌹🌹🌹